ఎన్నికలు.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండగ. పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం పరీక్షే. ఎన్నికల బరిలో నిలవాలంటే డబ్బు కావాల్సిందే. అందుకు ప్రజలను ఆశ్రయిస్తున్నారు అభ్యర్థులు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఈ సంప్రదాయం బాగా పెరిగిపోయింది.
ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్... ప్రజల నుంచి అంతర్జాలం ద్వారా నిధులు సేకరించడం. ఈ విధానం ఐరోపా దేశాల్లో ఎప్పుడో మొదలైంది. 2017లో మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్‌కు పరిచయం అయింది. ఇప్పుడు మన దేశంలో ఈ విధానం మరింత విస్తృతమైంది.
ఉక్కు మహిళ మొదటి అడుగు
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)కు వ్యతిరేకంగా ఏళ్లపాటు పోరాడారు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల. 2017లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీ స్థాపించారు. ఆ సమయంలో పార్టీకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.4.5 లక్షలు సేకరించారు. ఈ పద్ధతి రాజకీయాల్లో వేగంగా వ్యాప్తి చెందింది. ఈ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆన్లైన్లో విరాళాలు సేకరించే పనిలో పడ్డారు.
- జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్... మొదటిసారి ఎన్నికల్లో నిలిచారు. సీపీఐ తరఫున బిహార్ బెగూసరాయ్ నుంచి పోటీ చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్‌లో మొదటి స్థానం ఆయనదే. 5,500 మంది నుంచి రూ. 70 లక్షలు విరాళాలుగా సేకరించారు కన్నయ్య.
- ఉత్తర దిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి మర్లేనాకు రూ. 50 లక్షలు విరాళాలుగా అందాయి.
- ఆంధ్రప్రదేశ్ పర్చూరు స్థానంలో బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్ కుమార్ రూ.1.9 లక్షలు పొందారు.
- సీపీఎం సీనియర్ నేత మహ్మద్ సలీం రూ.1.4 లక్షలతో నాలుగో స్థానంలో నిలిచారు.
ఆప్ నేత రాఘవ్ చడ్డా, పటియాలాలో ధరమ్వీర్ గాంధీ, గోవాలో ఎల్విస్ గోమ్స్, ముంబయి ట్రాన్స్‌జెండర్ కార్యకర్త స్నేహ కాలే, ఆమ్ ఆద్మీ పార్టీలోని ఎక్కువ మంది ఈ పద్ధతిపైనే ఆధారపడుతున్నారు.
ఆన్లైన్ క్రౌడ్‌ఫండింగ్ వెబ్సైట్ OurDemocracy.in ఇలా 40మంది అభ్యర్థులకు 17వేల మంది నుంచి మొత్తం రూ.1.4కోట్లు సేకరించి పెట్టింది.
పారదర్శకతకు పెద్దపీట
ఎన్నికల కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కొత్త కాదు. ఇంటింటికీ వెళ్లి చందాలు వసూలు చేసేవి రాజకీయ పార్టీలు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా కార్పొరేట్‌మయం అయింది. భారీగా విరాళాలు ఇచ్చాం కాబట్టి ప్రభుత్వాలు మేము చెప్పినట్టు నడుచుకోవాలన్న ధోరణి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆన్లైన్ క్రౌడ్‌ఫండింగ్ ఉత్తమ మార్గమన్నది విశ్లేషకుల మాట.
"ఎన్నికల్లో పోటీ చేసేవారికి నిధుల సేకరణకు పారదర్శక పద్ధతి క్రౌడ్ ఫండింగ్ మాత్రమే. మేమూ అదే ఎంచుకున్నాం. వామపక్షాల్లో ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఉంది. ఇంటింటికీ వెళ్లి మేం ప్రజల్ని అడిగేవాళ్లం. ఇప్పుడు ఆన్లైన్ విరాళాలతో పని మరింత సులువైంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వచ్చి చేరుతుంది."
- రెజా హైదర్, కన్నయ్య కుమార్ ప్రచారకర్త
" ఆన్లైన్ విరాళాల వేదికతో నల్లధనం సమస్య ఉండదు. అభ్యర్థులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. నాయకులతో పాటు ప్రజల స్పందన బాగుంది. విరాళాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు రూ. 5వేల గరిష్ఠ పరిమితి విధించాం. విరాళమిచ్చిన ప్రతి వ్యక్తి మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు తప్పకుండా తీసుకుంటాం."
-ఆనంద్ మంగ్నాలే, క్రౌడ్‌ఫండింగ్ వెబ్సైట్ సహవ్యవస్థాపకుడు
ఇవీ చూడండి: