ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని అతిథిగృహంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు పోలీస్‌స్టేషన్‌లో కేసు దాకా వెళ్లింది. జన్మదిన వేడుకలను భిన్నంగా జరుపుకోవాలని భావించిన యువకులు.. పార్టీలో కాస్త కళాపోషణను చూపించారు. విందు, మందుతో పాటు చిందులేశారు. 20 మంది యువకులు ఐదుగురు డాన్సర్లతో కలిసి స్టెప్పులేశారు. విందు ఆరగిస్తూ.. మద్యం తాగుతూ.. యువతులతో డాన్సులు చేస్తూ హోరెత్తించారు.
ఓ పోలీసు అధికారి, పలువురు పోలీసుల పిల్లలు, ప్రముఖ నేతల తనయుల సమక్షంలో ఓ యువకుడు తన పుట్టిన రోజు వేడుకను గుంటూరు నగరంలో పట్టపగలే ఓ ఫంక్షన్ హాల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మరీ నిర్వహించారు. దీనికి విజయవాడకు చెందిన ఆరుగురు యువతులను పిలిపించి వారితో డ్యాన్సులు వేయించడం తీవ్ర విమర్శలకు దారితీంది. ఆర్కెస్ట్రా సౌండ్‌లు, యువతుల అదిరిపోయే డ్యాన్సులు, యువకులు కేరింతలతో రెచ్చిపోయారు. డ్యాన్సర్లతో కలిసి చిందులు వేయడం, ఫూటుగా మద్యం తాగి హంగామా చేయడంతో ఫంక్షన్ హాల్ సమీప వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకుని యువతీ యువకులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పోలీసు శాఖకు చెందిన ఓ సీఐ, కానిస్టేబుల్‌తో పాటు పలువురు పోలీసుల పిల్లలు, ప్రముఖ నేతల పిల్లలను తప్పించి మిగిలిన వారిపై ప్రజలకు అసౌకర్యం కలిగించారని, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమం నిర్వహించారని, మద్యం తాగారని కేసులు నమోదు చేశారు.
ఎక్కడ తేడా వచ్చిందోగానీ ఆ కార్యక్రమానికి హాజరైన ఓ సీఐ, ప్రముఖుల పిల్లల ఫొటోలు, వారు డ్యాన్సర్లతో కలిసి చిందులు వేస్తున్న వీడియోలను బయటపెట్టారు. పుట్టిన రోజు జరుపుకొన్న యువకుడికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం. దీంతో కొందరు పెద్దలు జోక్యం చేసుకుని తీవ్రమైన సెక్షన్లు బనాయించకుండా లాబీయింగ్ చేశారని వినికిడి. దీనిపై పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా సోమవారం మధ్యాహ్నం నుంచి రింగ్‌రోడ్డులోని ఓ హోటల్ పైభాగంలో ఫంక్షన్ జరుగుతోందని, డ్యాన్సులు వేస్తూ హంగామా చేస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. అక్కడకు వెళ్లి చూడగా డ్యాన్సులు వేస్తూ యువతులు, మద్యం తాగుతూ యువకులు కనిపించారని, వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. తాము అక్కడకు వెళ్లిన సమయంలో సీఐ అక్కడ లేరని చెప్పారు. కొందరు పోలీసుల పిల్లలు, ప్రముఖుల పిల్లలు ఉన్నారని, వారిని కేసు నుంచి తప్పించాలని ఒత్తిళ్లు వచ్చినా ఎవరినీ వదల్లేదని, అదుపులోకి తీసుకున్న 25 మందిపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిలిచ్చి పంపామన్నారు. సీఐతో పాటు పలువురు పోలీసు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి కదా అని ప్రశ్నిస్తే దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
లక్ష్మీపురానికి చెందిన కె.రాకేష్ అనే యువకుడు పుట్టిన రోజు చేసుకున్నాడని, ఆ యువకుడి నేపథ్యంపై ఆరా తీస్తున్నామని వివరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించడం (పబ్లిక్ న్యూసెన్స్), హాజరైన వారిలో చాలా మంది మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం విస్మరించడం, మద్యం తాగడం వంటివి చేయటంతో వారిపై కొవిడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని తెలిపారు. డ్యాన్సర్లు, ఆర్కెస్ట్రా బృందం మొత్తం పది మంది అని, వారంతా విజయవాడ నుంచి వచ్చారన్నారు.
ఇదీ చూడండి: Fire Accident: పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం