Man suicide due to delay in car delivery : కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని భావిస్తే.. అనుకున్న సమయానికి కారు డెలివరీ ఇవ్వలేదన్న క్షణికావేశంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం రోజున ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన తెలగాపురం కృష్ణ(21) కారు కొనుగోలు చేసి.. కిరాయిలకు తిప్పుతూ ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకోసం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ షోరూమ్‌ను సంప్రదించాడు. కారు ధర రూ.8.71 లక్షలు కాగా.. రూ.2.5 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు మే 23న రూ.50 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.2 లక్షలు చెల్లించి.. కారును తీసుకెళ్లాలని నిర్వాహకులు సూచించారు.
కృష్ణ రూ.2 లక్షలు సమకూర్చుకుని శనివారం షోరూమ్‌కు వెళ్లాడు. తన వద్ద ఉన్న రూ.2 లక్షలను షోరూమ్ నిర్వాహకులకు చెల్లించగా.. నిర్వాహకులు మరో రూ.50 వేలు చెల్లించాలని, కారు డెలివరీ ఇవ్వడానికి సమయం పడుతుందని వెల్లడించారు. దీంతో కారు తెచ్చుకుందామని హుషారుగా షోరూమ్‌కు వెళ్లిన కృష్ణ.. నిర్వాహకుల మాటలతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. షోరూమ్ నిర్వాహకులు తనను మోసం చేశారని మనస్తాపానికి గురై.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. ప్రేమ పేరుతో ఒకరు.. స్నేహం మాటున మరొకరు.. బాలికపై అఘాయిత్యం
ప్రేయసితో కలిసి లాడ్జికి.. యువకుడు హఠాన్మరణం.. జేబులో 'శృంగార' మాత్రలు