ప్రేమించమని వేధిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపిందనే కారణంతో చిత్తూరులో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కను రక్తపు మడుగులో చూసిన యువతి తమ్ముడు కోపంతో ప్రేమోన్మాదిని బండతో కొట్టి చంపాడు.
ఏపీలోని చిత్తూరులోని సాంబయ్యకండ్రిగకు చెందిన వరదయ్య, లతకు సుష్మిత(22), సునీల్ సంతానం. సుష్మిత గుడిపాల మండలం చీలాపల్లి సీఎంసీలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. వెనుక ఇంట్లోనే ఉంటున్న చిన్నా(24) ప్రేమించాలంటూ కొన్నినెలలుగా వేధిస్తుండటంతో యువతి ఈ ఏడాది జనవరిలో గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో యువకుడు కొంతకాలం జైలులో ఉన్నాడు. శుక్రవారం ఉదయం యువతి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి నిద్రిస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నా.. యువతి ఉంటున్న ఇంటి దాబా ఎక్కి లోపలకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని రెండుసార్లు పొడిచాడు. సంఘటనా స్థలంలోనే యువతి మృతి చెందింది. అనంతరం నిందితుడు కూడా అక్కడే కత్తితో గొంతు కోసుకున్నాడు. బయటకు వెళ్లి వచ్చిన యువతి తమ్ముడు సునీల్.. చిన్నాను ఇంటి బయటకు తీసుకొచ్చి రాయితో తలపై కొట్టడంతో అతనూ మరణించాడు.