The mother who left the children outside the temple: కష్టమొచ్చినా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల్ని ఏ తల్లి అయినా వదిలించుకోవాలనుకుంటుందా? అర్ధరాత్రి చిమ్మచీకట్లో రోడ్డు మీద విడిచిపెట్టే ధైర్యం చేస్తుందా? అభంశుభం తెలియని చిన్నారులను ఆ తల్లిది ఎంత రాతిగుండెనో గానీ పదేళ్లలోపు వయసున్న తన ముగ్గురు బిడ్డల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. యాదగిరిగుట్టలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన మానవతావాదుల గుండెలను పిండేస్తోంది.
పోలీసులు, బాధిత చిన్నారుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన బాబురావు, లక్ష్మి ఇద్దరు పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 10, 5, 2 ఏళ్ల వయసుగల ముగ్గురు కుమారులు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు. బాబురావు, లక్ష్మిది మెుదటి నుంచీ కలహాల కాపురమే. మూడేళ్ల క్రితం బాబురావు, ఇంట్లో చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.
తర్వాత లక్ష్మి అదే ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇటీవల అతడిని పెళ్లి చేసుకుంది. తమ కాపురానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని, వారిని వదిలించుకోవాలని లక్ష్మి, ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్త అనుకున్నారు. నలుగురు పిల్లలతో కలిసి ఆటోలో ఈ నెల 14న అర్ధరాత్రి యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రెండేళ్ల కొడుకును తనవద్దే ఉంచుకొని మిగతా పిల్లలను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. కొండ కింద అక్కడే ముగ్గురు పిల్లలు చలిలో వణుకుతూ తెల్లవారేదాకా ఉన్నారు.
సంక్రాంతి రోజు దైవ దర్శనానికి వచ్చిన భక్తులను యాచించి ఆకలి తీర్చుకున్నారు. పిల్లలను పాశం కోటి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి.. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఎస్సై సుధాకర్‌రావు జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులుకు సమాచారమిచ్చి ముగ్గురు పిల్లలను అప్పగించాడు. వారిని భువనగిరిలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
17న బాలల పరిరక్షణ విభాగం అధికారులు ఆ పిల్లలను విచారించారు. దీంతో పెద్దబాబు(10) వాళ్ల పెద్దనాన్న మెుబైల్ నంబర్ అధికారులకు ఇచ్చాడు. అధికారులు అతడిని భువనగిరికి రప్పించి, విచారించారు. బాబురావు తన తమ్ముడని అంగీకరించినా చిన్నతనం నుంచే తమతో దూరంగా ఉంటున్నాడని చెప్పాడు. అతడి పిల్లలతో తనకు సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం అధికారులు పిల్లల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని 20న యాదాద్రి భువనగిరి జిల్లా బాలల పరిరక్షణ సమితి ఎదుట ప్రవేశపెట్టారు.
అక్కడి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలల పరిరక్షణ సమితి విచారణలో పిల్లలు ఆశ్చర్యానికి గురి చేసే విషయాలను వెల్లడించారు. తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్న పిల్లలను వదిలించుకునేందుకు లక్ష్మి, ఆటో డ్రైవర్ అయిన ఆమె భర్త ఈ నెల 13న రాత్రి భగత్‌సింగ్ నగర్‌లోని వారి ఇంట్లోనే ఐదేళ్ల కుమారుడి నోట్లో గుడ్డలు కుక్కి, గొంతు నులిమి హత్య చేసే ప్రయత్నించారని చెప్పారు. దీన్ని 10 ఏళ్ల పెద్ద కుమారుడు అడ్డుకున్నాడని అన్నారు. ఆ మరుసటి రోజే ముగ్గురు పిల్లలను యాదాద్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: