చిన్నపాటి గొడవలకే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. భార్య, భర్తల మధ్య జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన బోనాల పెంటయ్య, చంద్రకళ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమారై. భార్యభర్తలు ఇద్దరే ఇంట్లోనే ఉంటున్నారు. చిన్న విషయంలో వారి మధ్య మాటామాటా పెరిగి గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బయటకు వెళ్లి బలవన్మరణానికి పాల్పడింది.
ఘట్‌కేసర్-బీబీనగర్ రైల్వే స్టేషన్ ఎన్‌ఎఫ్‌సీ గేట్ సమీపంలో పట్టాలపై చంద్రకళ మృతదేహం గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.