iPhone fraud: ఆన్లైన్లో రూ.20 వేలకు పైగా ఉన్న ఐఫోన్ రూ.4 వేలకే ఇస్తామని ఆఫర్ పెట్టి.. ఆర్డర్ చేసిన వాళ్లకు చిత్తు కాగితాలు వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన రాంసాని శ్రీను అనే యువకుడి చరవాణికి జులై 28న గుర్తుతెలియని నెంబరు నుంచి ఓ లింకు వచ్చింది. ఎంటా లింకు..? అని తెరిచిన శ్రీనుకు.. కళ్లు చెదిరే ఆఫర్ కనిపించింది. 20 వేలకు పైగా ఉన్న యాపిల్ ఫోన్.. కేవలం నాలుగు వేలకే లభిస్తోందని ఆ ఆఫర్ సారాంశం. ఈ ఆఫర్‌ను చూసి ఒక్క నిమిషం అవాక్కయిన శ్రీను.. తనకు వచ్చిన ఆఫర్ నిజమేనా..? ఎదైనా మోసమా..? అని ఆలోచించాడు.
![waste papers delivered Instead of apple phone in Birkoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16003043_dv.jpg)
కానీ.. అతని ఆలోచనను ఆశ అనే మబ్బు కమ్మేసింది. తలుపుతట్టిన అదృష్టాన్ని.. అనుమానిస్తూ జారవిడుచుకోవద్దని మనసుకు సర్దిచెప్పుకున్నాడు. వెంటనే అదే లింక్‌లో.. ఫోన్ కోసం ఆర్డర్ పెట్టాడు. ఆగస్టు 2న ఫోన్ డెలివరి అవుతుందని సందేశం వచ్చింది. కాగా.. ఫోన్ కోసం శ్రీను ఎంతో ఆశగా ఎదురుచూడసాగాడు. మంగళవారం రోజు.. డెలివరిబాయ్ రానే వచ్చాడు. అతి తక్కువ ధరకే.. ఖరీదైన ఫోన్ వస్తోందన్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న మనసుతో.. డెలివరీ బాయ్ ఇచ్చిన పార్సిల్ తీసుకున్నాడు.
![waste papers delivered Instead of apple phone in Birkoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16003043_56_16003043_1659523544266.png)
ఎప్పుడెప్పుడు తన మొబైల్‌ను చూస్తానో అన్న ఉత్సుకతతో ఉన్న శ్రీను.. ఆలస్యం చేయకుండా పార్సిల్ చేతికందగానే తెరిచి చూశాడు. పార్సిల్ విప్పి చూడగా.. విస్తుపోవటం శ్రీను వంతైంది. పార్సిల్లో మొబైల్ లేకపోగా.. లోపల మొత్తం చిత్తు కాగితాలే దర్శనమిచ్చాయి. ఎంతో ఆశగా ఎదురుచూసిన శ్రీను.. చిత్తు కాగితాలను చూసి చూసి బిత్తర పోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పటంతో.. గ్రామస్థులు డెలివరిబాయ్ను పట్టుకుని గట్టిగా నిలదీశారు. పార్సిల్లో ఏముంటుందో తనకేం తెలియదని.. ఆయా కంపెనీల నుంచి వచ్చే వస్తువులను తాము సరఫరా మాత్రమే చేస్తామని.. ఏదైనా ఉంటే కంపెనీని సంప్రదించాలని సూచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించగా బయటపడిన డెలివరిబాయ్.. బాధితుడి నుంచి కంపెనీకి లెటర్ రాయించుకున్నాడు. శ్రీనుకు డబ్బులు తిరిగి చెల్లించడంతో డెలివరిబాయ్ను గ్రామస్థులు వదిలేశారు.
![waste papers delivered Instead of apple phone in Birkoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16003043_dvd.jpg)
ఇవీ చూడండి: