వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్లబెల్లి మండలం మేడపల్లికి చెందిన వీఆర్వో ఏదురుబోయిన ఐలయ్య మూడువేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
గ్రామానికి చెందిన దేవరాజు ఏకాంబరం కూతురు మౌనిక వివాహం కావడంతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయగా.. ప్రభుత్వం నుంచి సాయం మంజూరైంది. అందుకోసం డబ్బులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే కల్యాణలక్ష్మి డబ్బులు మంజూరు చేయించినందుకు రూ.5 వేలు ఇవ్వాలని వీఆర్వో ఐలయ్య డిమాండ్ చేస్తూ బాధితున్ని ఇబ్బందులకు గురి చేశాడు.
దీంతో అతని వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నర్సంపేట శివారు రాజుపేట గ్రామంలో వీఆర్వో మూడు వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.