Volunteer Cheating: ప్రభుత్వ పథకాల పేరుతో ఓ వృద్ధురాలికి ఎరవేసి గుట్టుచప్పుడు కాకుండా ఆస్తి రాయించుకున్నారు. పింఛను పెరిగిందని చెప్పి.. అందుకు సంబంధించిన కాగితాలపై సంతకాలు చేయాలని.. ఆమెను నమ్మించి మోసం చేశారు. ఆస్తి జప్తు చేస్తున్నట్లు ఇంటికి నోటీసులు రావడంతో తల్లీకుమారుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఓ వాలంటీర్.. వృద్దురాలికి పింఛను ఇస్తూ.. ఆమె వేలు ముద్ర వేయించుకుని ఆస్తులు రాయించుకున్నాడు. కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లిలో వాసంశెట్టి మంగాయమ్మ(75) తన కుమారుడు విశ్వనాథంతో కలిసి నివసిస్తోంది. మంగాయమ్మకు ప్రభుత్వ వృద్ధాప్య పింఛను అందుతోంది. వాలంటీర్ రవికుమార్ గత జనవరిలో పింఛను పెరిగిందని చెప్పి.. కొన్ని కాగితాలపై వేలిముద్రలు వేయించుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఆస్తి జప్తు చేసినట్టు నోటీసులు రావడంతో.. తల్లీ కొడుకు ఖంగుతిన్నారు.
విశ్వనాథం భార్య సత్యవేణి కుటుంబ కలహాలతో వేరుగా ఉంటోంది. వైకాపా తరఫున ఎంపీటీసీగా గెలిచిందని.. ఆమె వాలంటీర్ ద్వారా తమ తల్లి వేలిముద్రలు వేయించుకుని ఆస్తి కాజేసిందని విశ్వనాథం ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన రవికుమార్.. కుల ధ్రువీకరణ పత్రం కోసమే వేలిముద్రలు వేయించుకున్నానని.. ఆస్తి కోసం కాదని చెబుతున్నారు. తాను కేవలం రెండు కాగితాలపై మాత్రమే సంతకం పెట్టించుకున్నట్లు వెల్లడించారు.
"రవికుమార్ మా ఇంటికి వచ్చి.. పింఛను డబ్బులు ఇచ్చి కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాడు. ఏం కాగితాలివి అని అడిగితే.. పింఛను పెరిగింది.. దేవి మేడమ్ సంతకాలు పెట్టించుకురమ్మంటే వచ్చానన్నారు. ఇల్లు మారిపోయారు కదా.. సాక్ష్యం కోసం, సచివాలయంలో ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత మూడ్రోజులకు ఇంటికి నోటీసులు వచ్చాయి. రూ. 30 లక్షలకు ఆస్తంతా బేరం చేసుకున్నట్లు.. ఇప్పటికే 25 లక్షలు కట్టినట్లు.. ఇంకో 5 లక్షలు కట్టి ఆస్తి సొంతం చేసుకోవాలని నోటీసు వచ్చింది. కానీ మేం ఎవరికీ అమ్మలేదు. పింఛను డబ్బుల పేరుతో మమ్మల్ని మోసం చేశారు." -మంగాయమ్మ, బాధితురాలు
ఇదీ చదవండి: Son Killed Mother in Medak: బైక్ కొనివ్వలేదని... కన్నతల్లినే కడతేర్చాడు