విశాఖలో ఈ నెల 13న ఉన్మాదిగా మారిన యువకుడు చేసిన పెట్రోలు దాడిలో(PETROL ATTACK ON GIRL) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో తెలంగాణలోని భూపాల్‌పల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి యువతిపై పెట్రోలు(VISHAKA PETROL ATTACK) పోసి నిప్పంటించడం ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అనంతరం తానూ పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్న హర్షవర్ధన్ ఈ నెల 16న మరణించాడు. కాలిన గాయాల కారణంగా శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిని నిన్న యువతి మృతి చెందినట్లు దిశ ఏసీపీ ప్రేమ్‌కాజల్ ‘ఈటీవీ-భారత్’కు తెలిపారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
చిన్నతనం నుంచి చదువులో రాణించిన యువతికి పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో భారీ రాయితీతో సీటు రావడంతో అక్కడికి వెళ్లి చదువుకుని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఆ సమయంలో పరిచయమైన తోటివిద్యార్థి హర్షవర్ధన్‌తో స్నేహం చేయడం ఆమెకు శాపంగా మారింది. ఇంజినీరింగ్ అనంతరం ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్న ఆమె కోసం హర్షవర్ధన్ విశాఖ వచ్చారు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు...తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి నడుము భాగం నుంచి ముఖం వరకు తీవ్రంగా కాలిపోయింది. హర్షవర్థన్‌రెడ్డి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డాడు.
సాయంత్రం సుమారు 4.15 గంటల సమయానికి ప్రమాదం జరిగితే.. పోలీసులకు 6.30గంటలకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో యువకుడే ప్రధాన నిందితుడని తేల్చారు. యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు.
నిందితుడిపై హత్యాయత్నంతో పాటు ఆత్మహత్యాయత్నం కేసులను నమోదు చేశారు. అలాగే పెట్రోలు పోసి నిప్పంటించడానికి ముందు తనతో తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆ యువతి ఆదివారం ఉదయం పోలీసులకు చెప్పడంతో.. హర్షవర్థన్ రెడ్డిపై లైంగిక వేధింపుల సెక్షన్లను కూడా జోడించారు.
హర్షవర్ధన్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి రాంరెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గతేడాదే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డికాలనీలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి :