Usma Begum murder case: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకుడి కోసం ఇల్లు వదిలివెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలోనే దారుణహత్యకు గురైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో హతురాలు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం(32)గా గుర్తించారు. గజరౌలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెక్‌మేట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల కిందట మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శనివారం హత్య మిస్టరీని ఛేదించారు.
అమ్రోహా ఎస్పీ ఆదిత్య లంగే మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. మొదట కంపెనీ ఉద్యోగులను విచారించగా.. షెహజాద్ అనే యువకుడి వద్ద ఆ కంపెనీ తాళంచెవి ఒకటి ఉంటుందని తెలిపారు. పోలీసులు షెహజాద్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడంతో ఫేస్‌బుక్ ప్రేమ కథ మొత్తం బయటపడింది. ఆయన్ను కలిసేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలుదేరిన ఉస్మా అతడి సూచన మేరకు గజరౌలా చేరింది.
షెహజాద్‌ను కలుసుకొన్న ఆమె పెళ్లి చేసుకొందామని ఒత్తిడి తెచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన షెహజాద్ దుపట్టాతో ఆమెను కట్టేసి, ఇటుకతో కొట్టి తలపై చితకబాదాడు. ఆ తర్వాత కంపెనీ ఆవరణలో ఓ మూలన యువతి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.
బాన్సువాడ ఠాణాలో అదృశ్యం కేసు: భర్త ముఖీద్‌తో కలిసి బాన్సువాడలో నివాసం ఉంటున్న ఉస్మా బేగం ఈ నెల 6న అదృశ్యమైంది. ఆమె భర్త బాన్సువాడ ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోనే యూపీలో ఉస్మాబేగం హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. 12 ఏళ్ల కిందట బాన్సువాడకు చెందిన ముఖీద్‌తో ఆమెకు వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో రెండు నెలలు నిజామాబాద్‌లో ఉంది. పెద్దలు రాజీ చేయడంతో ఈ నెల 4న బాన్సువాడకు వెళ్లింది. తిరిగి రెండ్రోజుల్లోనే అదృశ్యమై ఆ తర్వాత యూపీలో హత్యకు గురయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు యూపీకి వెళ్లారు.
ఇవీ చదవండి: