ఏపీలోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం గంగి రెడ్డిపల్లిలో జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసును పోలీసులు ఛేదించారు. జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు మౌలాలిని సోమవారం అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు.
డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు..
గంగిరెడ్డి పల్లికి చెందిన మౌలాలి వివాహేతర సంబంధం కారణంగా భార్య సరళ (40)ను గతేడాది సెప్టెంబర్ 29న హత్య చేసి పెద్దేరు ప్రాజెక్టు నీళ్లలో మృతదేహాన్ని పడేశాడు. కూతురు కనిపించకపోవడం వల్ల.. సరళ తల్లి గంగులమ్మ మౌలాలినీ నిలదీసింది. ఆమెను కూడా అక్టోబర్ 1న గొంతు నులిమి చంపేసి గంగ చెరువు నీటిలో మృతదేహాన్ని పడేశాడు. తల్లి, అమ్మమ్మ కనపడకుండా పోవడం వల్ల... సరళ ముగ్గురు పిల్లలు 7, 11, 15 ఏళ్లున్న కుమారుడు, ఇద్దరు కుమార్తెలు మౌలాలి నిలదీశారు. సరళ, గంగులమ్మలకు కరోనా సోకింది... ఆసుపత్రిలో ఉన్నారని సమాధానమిచ్చాడు. పిల్లలను కర్ణాటకలోని ఒక ప్రాంతంలో నిర్బంధంలో ఉంచాడు.
ఇటీవల సరళ, గంగులమ్మ, ముగ్గురు పిల్లలు కనిపించలేదని బంధువులు పోలీసుల దృష్టికి తెచ్చారు. ములకలచెరువు సీఐ సురేష్ కుమార్, తంబళ్లపల్లె ఎస్.ఐ సహదేవి సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో సరళ, గంగులమ్మ మృతదేహాలను పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో దుస్తులు ఎముకలు మాత్రం గుర్తించారు. పోలీసులు ఆ ఆనవాళ్లను డీఎన్ఏ పరీక్షలకు పంపి మౌలాలిపై హత్య కేసు నమోదు చేశారు. పిల్లల ఆచూకీని కనుగొని వారి బంధువులకు అప్పజెప్పినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య