మనిషిలో రోజురోజుకీ మానవత్వం చచ్చిపోయి హింస ప్రేరేపితమవుతోంది. అప్పటిదాకా ఆప్తులుగా ఉన్నవారే క్షణంలో ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ తమ్ముడితోపాటు తల్లిని పొట్టనబెట్టుకుంది. ఆస్తి తగాదాలతో బాంధవ్యాలను మరిచి తల్లిని, తమ్ముడిని బల్లెంతో పొడిచి దారుణంగా హతమార్చిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లలో చోటుచేసుకుంది. జంగాల కాలనీకి చెందిన కృష్ణయ్య, మారెమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు. చివరి ఇద్దరు కుమారుల మధ్య ఏర్పడిన భూవివాదం.... తమ్ముడిని పొడిచి చంపే వరకు వచ్చింది. అడ్డు వచ్చిన తల్లినీ పొట్టనబెట్టుకున్నాడు. జంట హత్యల నిందితుడు పరారీలో ఉండగా.. గ్రామంలో విషాదం నెలకొంది.
భర్త మాట వినలేదని..
మరో ఘటనలో కుటుంబ కలహాలతోపాటు భర్త తన మాట వినకుండా పంచాయితీకి వెళ్లాడని ఆ ఇల్లాలు ఇద్దరు చిన్నారులతోపాటు తానూ ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన శ్రీనాథ్ రామాపురంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. శ్రీనాథ్‌కు భార్య మౌనికతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. వారికి మూడేళ్ల కుమార్తె, ఏడాదిన్నర బాబు ఉన్నారు. సూర్యాపేటలో బంధువుల పంచాయితీకి శ్రీనాథ్ వెళ్లగా వద్దని మౌనిక హెచ్చరించింది. ఇదే విషయంలో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో మనస్తాపానికి గురైన మౌనిక.. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
భార్య పాలిట కాలయముడిగా..
కట్టుకున్న భార్య పాలిట కాలయముడిగా మారి చివరకు తానూ తనువు చాలించిన విషాదకర ఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన దంపతులు జగన్, స్వాతి... వ్యవసాయ పనులు చేసేవారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన జగన్.. భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం వారి మధ్య వివాదం తలెత్తినా ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. ఐతే భార్యభర్తలు తిరిగిరాకపోవడంతో యజమాని గాలించగా నిమ్మ తోటలో విగతజీవిగా స్వాతి... అర కిలోమీటరు దూరంలో ఆమె భర్త చెట్టుకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాల్ని పరిశీలించగా స్వాతి మెడపై గాయమై ఉంది. భార్యను కత్తితో హత్య చేసి తానూ ఉరివేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఇలా చిన్న చిన్న కారణాలకే కుటుంబసభ్యుల్ని పొట్టనబెట్టుకున్న ఘటనలు మానవత్వానికే మచ్చగా మారుతున్నాయి.
ఇదీ చదవండి: SUICIDE: ప్రాణాలు తీసిన క్షణికావేశం... పిల్లలకు ఉరేసి తల్లి బలవన్మరణం