ఓవర్ టేక్ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
భూపాలపల్లి మండలం సెగ్గంపల్లి గ్రామానికి చెందిన జిముడ అశోక్ (35), సింగరేణిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న పంతే రవిశంకర్ (40)తో కలిసి ద్విచక్రవాహనంపై పరకాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అదేక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఉరుసుగుట్టకు చెందిన వ్యక్తులు కారులో కాళేశ్వరం నుంచి హన్మకొండకు తిరిగి వస్తుండగా బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్దకు రాగానే లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. రవిశంకర్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న రేగొండ ఎస్సై కృష్ణ ప్రసాద్ గౌడ్ ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.