పార్క్ చేసిన వాహనాలను దొంగిలిస్తున్నఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు (sultan bazar police station) అరెస్ట్ చేశారు. రూ.4 లక్షల విలువైన ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. మహబూబ్ నగర్‌కు చెందిన కారు డ్రైవర్ సత్య రాంకృష్ణ, నారాయణపేట నర్సింహాలు కలిసి పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారు.
సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ఇందిరా బాగ్‌లోని మందుల దుకాణల వద్ద పార్కు చేసిన ద్విచక్ర వాహనాలు దొంగతనం అవుతున్నాయని… ఈ నెల 22న ఫిర్యాదు అందిన్నట్లు సీఐ తెలిపారు. దీంతో వాహనాలు దొంగిలిస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు.
కోఠి ఆంధ్రా బ్యాంక్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా సత్య రాంకృష్ణ, నర్సింహాపై అనుమానం వచ్చి ఆపగా… వారి వద్ద వాహనానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు ఒప్పుకున్నారని సీఐ పేర్కొన్నారు. వారిపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 10 కేసులు ఉన్నాయని తెలిపారు. దొంగిలించిన వాహనాల ద్వారా వచ్చే డబ్బుతో వారు జల్సాలు చేసుకునేవారని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: viral video: పోలీసులు బైక్ తీసుకున్నారంటూ రోడ్డుపై పడుకొని హంగామా