మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... కొంతకాలంగా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కమిషన్‌లు ఇస్తామని చెప్పి... ఓటీపీ, ఏటీఎం నంబర్ వివరాలు సేకరించి ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు. ఆ నగదుతో ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి కమిషన్ పొందుతున్నారు.
దీనికి ఆకర్షితులైన ఏపీలోని చిత్తూరు జిల్లా మిట్టూరుకు చెందిన హరిప్రసాద్, శ్రావణ్... తమకు తెలిసిన వారి క్రెడిట్ కార్డుల ద్వారా వస్తువులు కొనుగోలు చేసి, అధిక మొత్తంలో కమిషన్ అర్జిస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ప్రజలు మోసపోతున్న నగదు హరిప్రసాద్, శ్రావణ్‌లకు వెళ్తున్నట్లు గుర్తించారు.
చిత్తూరుకు చేరుకున్న ఎంపీ రాష్ట్ర పోలీసులు, స్థానిక క్రైం పోలీసుల సహకారంతో మిట్టూరులోని రాగిమానువీధిలో హరిప్రసాద్, శ్రావణ్‌ను అరెస్టు చేశారు. ఏడాది కాలంలో వారు రూ.28 లక్షలు వ్యాపారం చేసినట్లు గుర్తించి, వారి నుంచి పలు ఆధారాలను సేకరించారు. ఇద్దరినీ మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లి, అక్కడి న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పార్టీ మారిన నేతకు వీఐపీ భద్రత కట్!