వివాహేతేర సంబంధం ఇంట్లో తెలిసిందని.. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన కత్తుల సంతోష్(30)కు పెళ్లై.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. కూలీ పని చేసుకునే సంతోష్... కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం సంతోష్ భార్యకు తెలిసింది. ఆమెతో కలిసి కూలీకి ఎందుకు వెళ్తున్నావని ఈనెల 22న భర్తను నిలదీసింది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది జరిగిన రోజు రాత్రి సంతోష్.. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆమె కూడా అదే రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు తెలిసిన చోట్లన్నీ వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మూడు రోజులకు వాళ్లిద్దరి మృతదేహాలు పోచారం ప్రాజెక్టులో లభ్యమయ్యాయి.
గురువారం (నవంబర్ 25న) రోజున.. మెదక్ – కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టులో ఇద్దరి మృతదేహాలు తేలటం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంతో దొరికిన ఆధారాల ప్రకారం.. మృతదేహాలు కామారెడ్డి జిల్లాకు చెందిన వారివేనని గుర్తించారు. 22 రాత్రి లేదా ఉదయాన్నే జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.
సంతోష్ తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను మెదక్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: