Farmers suicide : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓవైపు పంట నష్టం... మరోవైపు అప్పులబాధ.. చేసేది లేక ఇద్దరూ... పురుగుల మందు తాగి... బలవన్మరణం చెందారు.
అప్పు ఎలా తీర్చాలో తెలియక..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోతు రాజారాం ఎకరం భూమి కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. దాదాపు లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం చెమటోడ్చి సాగు చేశారు. దిగుబడి రాకపోవటంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వడగళ్ల పిడుగు..
మరో ఘటనలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లికి చెందిన సూరయ్య బలవన్మరణం చెందారు. రెండు ఎకరాల్లో మిరప , మొక్కజొన్న సాగు చేశారు. పంటలు చేతికి అందివచ్చే సమయంలో వడగళ్ల వర్షం పడి... నష్టపోయారు. అప్పు తీర్చలేనని భావించి ఈ నెల 2 న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ఇదీ చదవండి: Rythu bandhu Stopped: గంజాయి సాగు చేసిన రైతు.. రైతుబంధు బంద్ చేసిన అధికారులు