కరెంట్ తీగలు ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెడుతున్నాయి. కర్షకుల పాలిట యమపాశమవుతున్నాయి. వేలాడే వైర్లు.. బావుల వద్ద ఫ్యూజులు.. రైతుల పాలిట మరణశాసనం రాస్తున్నాయి. ఓవైపు మూగజీవాలు.. మరోవైపు అన్నదాతలు విద్యుదాఘాతానికి బలైపోతున్నారు.
వానాకాలం ప్రారంభమైంది.. తొలకరి జల్లులు కురుస్తున్నాయి.. ఈ సంబురంలో.. వానాకాలం పంట వేయడానికి ఆ రైతులు పొలానికి వెళ్లారు. పొలం దున్నడానికి ముందు.. నీళ్లు పెట్టాలనుకున్నారు. మోటార్ వేయడానికి వెళ్లారు. బోరు స్టార్టర్కు ఉన్న ఫ్యూజులు పోవడం వల్ల వాటిని వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. బోర్‌కు ఉన్న ఎర్త్‌వైర్‌కు కరెంట్ సరఫరా అయింది. అది గమనించని రైతులకు వైర్ తగలగానే షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామ శివారులోని భోజ్యతండాలో చోటుచేసుకుంది.
ఇదీ చదవండి : అమానుషం : బతికుండగానే పాతి పెట్టించిన తల్లి
పక్కనే ఉన్న పొలానికి చెందిన రైతులు గుర్తించి వెంటనే పరుగులు తీశారు. అప్పటికే ఇద్దరు రైతులు మృతి చెందారు. వెంటనే వారి కుటుంబాలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు హుటాహుటిన పొలానికి చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న రైతులను చూసి గుండెలవిసేలా రోదించారు.
ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా ఉన్నాయని.. పంట బాగా పండుతుందని సంబురంగా పొలానికి వచ్చిన రైతులు కానరాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరుమున్నీరుగా విలపించారు. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు చూసి.. స్థానికులు కంటతడి పెట్టారు.
- ఇదీ చదవండి : ashada masam : ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు?