ETV Bharat Effect : తీవ్ర గాయాలతో వచ్చిన నిరుపేద భార్యాభర్తలకు కుట్లువేసేందుకు వైద్య సిబ్బంది డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై సోమవారం రోజున ‘ఈనాడు-ఈటీవీ భారత్’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇద్దరు వైద్యులను, డబ్బులు డిమాండ్ చేసిన వార్డుబాయ్‌ను సస్పెండ్ చేశారు. ముగ్గురు స్టాఫ్ నర్సులకు మెమోలు ఇచ్చారు.
వరంగల్ దేశాయిపేటకు చెందిన బింగి రామకృష్ణ, సరస్వతి దంపతులకు కుట్లువేయడానికి వార్డుబాయ్ ఎండీ అమ్జద్‌అలీ డబ్బులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య మంత్రి హరీశ్‌రావు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ ‘ఈనాడు-ఈటీవీ భారత్’ కథనం ఆధారంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేశారు.
అనంతరం వార్డుబాయ్ అమ్జద్ అలీని విధుల నుంచి తొలగించారు. లంచం అడిగిన అతనిపై మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సివిల్ అసిస్టెంటు సర్జన్ డాక్టర్ రితీశ్, అసిస్టెంటు ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ రంజిత్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ స్టాఫ్ నర్సులు యాకలక్ష్మి, ఎం.జ్యోతి, కె.సుజాతలకు మెమోలు జారీ చేశారు. సర్జికల్ వైద్యవిభాగం విభాగాధిపతిని వివరణ ఇవ్వాలని ఆదేశించారు.