Gas Cylinder Blast: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల రామిరెడ్డినగర్‌లోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. భవనంలోని ఓ గదిలో ఐదుగురు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఉంటున్నారు. వాళ్లంతా స్థానికంగా ఉండే పరిశ్రమల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.
మంగళవారం ఉదయం నుంచే గదిలో వీరంతా గొడవ పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గొడవ కారణంగా ముగ్గురు యువకులు కలిసి.. ఇద్దరిని హతమార్చి అనుమానం రాకుండా గ్యాస్ లీక్ చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు నబీయుద్దీన్, బీరేందర్‌గా పోలీసులు గుర్తించారు.
యువకులు నివసిస్తున్న గదిలో దాదాపు 8 గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో ఉండాల్సిన మిగతా యువకుల గురించి గాలిస్తున్నారు. పేలుడు దాటికి ఇంటి గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ శబ్దం రావడంతో భవనంలో నివసిస్తున్న మిగతా వారు కూడా... ఏం జరిగిందోననే ఆందోళనతో పరుగులు తీశారు. ఘటనాస్థలంలోని మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద పేలుడుగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.