హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా... ఉద్యోగం పేరుతో, కెవైసీ నెపంతో ఇద్దరు బాధితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు దోచుకున్నారు.
ఉద్యోగం ఎర చూపి...
కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి నౌకరి డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నట్టుగా ఓ సైబర్ లేడి ఫోన్ చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ కొరకు తాను పంపే లింక్ ద్వారా పది రూపాయలు చెల్లించాలని సూచించింది. కేవలం పది రూపాయలే కావటం వల్ల బాధితురాలు వెంటనే ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు యత్నించగా... ఫెయిల్ అయ్యి వెంటనే తన అకౌంట్ నుంచి రూ.21 వేలు మాయమయ్యాయి. తన అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని సదరు మహిళను ప్రశ్నించగా.. తప్పు జరిగిందని మరోసారి ప్రయత్నించాలని సూచించింది. ఇలా పలు మార్లు ఆ లింక్ ఓపెన్ చేసి సైబర్ లేడీకి ఓటీపీ చెప్పగా... మరో మూడు విడతల్లో 10,000, 20099, 2,00,986 నగదు డెబిటయ్యాయి. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 2 లక్షల 52 వేల 383 రూపాయలు మాయమయ్యాయి.
కేవైసీ అప్డేట్ పేరుతో...
కొంపల్లికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి కేవైసీ అప్డేట్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. తాము పంపే లింక్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయాలని సూచించగా... కృష్ణరెడ్డి వివరాలతో పాటు ఓటీపీ సైతం ఎంటర్ చేశాడు. వెంటనే తన బ్యాంకు ఖాతా నుంచి 99వేల 999 రూపాయల నగదు మాయమైంది. మోసపోయానని గ్రహించిన ఇద్దరు బాధితులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.