విదేశాలకు అక్రమంగా నిధులు తరలించిన కేసులో ఇద్దరు కీలక నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీపక్ అగర్వాల్, ఆయుష్ గోయల్‌ను అరెస్టు చేసి విశాఖపట్నం జైలుకు తరలించారు. దీపక్ అగర్వాల్‌ను మూడు రోజులు కస్టడీకి తీసుకొని విచారణ జరిపేందుకు విశాఖపట్నం న్యాయస్థానం అనమతివ్వటంతో జైలు నుంచి నిన్న అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆయుష్ గోయల్‌ను కూడా కస్టడీకి ఇవ్వాలని విశాఖపట్నం న్యాయస్థానాన్ని ఈడీ కోరింది.
విశాఖపట్నానికి చెందిన వడ్డి మహేశ్ ఇళ్లు, కార్యాలయాల్లో 2017లో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ... సుమారు 1500 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది. ఐటీ శాఖ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఏపీ సీఐడీ విచారణ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ... సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరుతో 1500 కోట్ల రూపాయల వరకు విదేశాలకు మళ్లించినట్లు గుర్తించింది.
కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రమోద్ అగర్వాల్, ఆయుష్ గోయల్, వికాస్ గుప్తా, వినీత్ గోయెంకా తదితరులు వడ్డి మహేష్ ద్వారా సొమ్ము తరలించినట్లు తేల్చింది. డొల్ల కంపెనీలు సృష్టించి.. చైనా, సింగపూర్, హాంకాంగ్‌కు నిధులు మళ్లించినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి బీకే గోయల్‌ను ఇప్పటికే అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు.
ఇదీ చదవండి: మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి