నల్గొండ జిల్లాలో హత్యకు గురైన ఎస్సీ మైనర్ బాలిక కేసు (Minor Girl Murder) సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలపై కేతేపల్లి ఎస్ఐ రామకృష్ణపై వేటు పడింది. ఈ నెల 13న కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మైనర్ బాలికహత్యకు గురైంది.
హత్యకు గురైన బాలిక... అదే గ్రామానికి చెందిన దోరేపల్లి పవన్ అనే యువకుడితో కొంతకాలంగా స్నేహంగా ఉంటోంది. ఇటీవల మరో యువకుడితో చనువుగా ఉంటోందని కక్ష పెంచుకున్న పవన్... ఈనెల 13న గ్రామ శివారులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. తన ప్రవర్తనపై ఆరా తీశాడు. బాలిక చెప్పిన మాటలు వినలేదు. ఆగ్రహంతో ఆమె దాడి చేశాడు.
ఫోన్లో మాట్లాడి...
హత్య చేసే ముందు నిందితుడు పవన్... సూర్యాపేట జిల్లా కుప్పిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన చెడుగు రాజుకు... సదురు బాలికను హత్య చేస్తున్నట్లు ఫోన్లో తెలిపాడు. విషయం విన్న నిందితుడి మిత్రుడు రాజు... బాలికను హత్య చేయవద్దంటూ ప్రాధేయపడ్డాడు. తాను వస్తున్నట్లు చెప్పి... హత్యను వారించేందుకు ఇద్దరు మిత్రులను తీసుకుని ఘటనాస్థలికి వెళ్లాడు. ఆలోపే పవన్.. బాలికను కిరాతకంగా హతమార్చాడు.
హత్యకు ముందు సదరు బాలిక, నిందితుడు పవన్... రాజుతో మాట్లాడిన ఆడియో టేపు వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఆడియో టేపు వైరల్‌గా మారింది. నిందితుడు పవన్... బాలికను చున్నీతో ఉరేసి... బీరు బాటిల్‌తో తలపై మోది దారుణ హత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... కుటుంబ సభ్యులకు... పోలీసులకు సమాచారం అందించారు.
ప్రతిపక్ష నాయకుల మండిపాటు...
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల బంధువులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ ఒత్తిడితో కేసును పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు... ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి వ్యక్తమయ్యాయి. బాధిత కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... చరవాణిలో పరామర్శించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
రీ పోస్టుమార్టం...
ఆయా రాజకీయ పార్టీలు... బంధువుల ఆరోపణలతో స్పందించిన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కేతేపల్లి ఎస్ఐ రామకృష్ణను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పోలీసులు ఈనెల 17న బాలిక మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. హత్య విషయాన్ని పోలీసులకు చెప్పకుండా గోప్యంగా ఉంచినందుకు నిందితుడు పవన్‌తో పాటుగా అతడి ముగ్గురు మిత్రులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయం ఫోరెన్సిక్ నివేదికలో తేలనుంది.
ఇదీ చదవండి: డోలీ కట్టి గర్భిణీ తరలింపు.. పుట్టిన కాసేపటికే మగబిడ్డ మృతి