భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకొంది. దుమ్ముగూడెం మండలం చింతగుప్పలో అటవీ శాఖ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని నిర్బంధించారు. సిబ్బందిని చుట్టుముట్టి చిన్న చిన్న కర్రలతో వారిపై దాడిచేశారు. అనంతరం వారిని చెట్టుకు కట్టేశారు. కాసేపు నిర్బంధించి అనంతరం వదిలేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్నామని.. వాటి జోలికి వస్తే ఊరుకోమని గిరిజనులు హెచ్చరించారు.
అటవీ శాఖ సిబ్బంది ఏమంటున్నారు..
హరితహారంలో భాగంగా చింతగుప్పలో 27 హెక్టార్ల భూమిని చదును చేస్తున్నాం. గతంలో ఒకసారి ఈ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. అప్పుడు వారికి సర్దిచెప్పాం. ఇప్పుడు చదును చేసే ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇవాళ డీఎఫ్వో క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో... ఆయన వాహనం వెళ్లేందుకు వీలుగా రహదారిని చదును చేసేందుకు మరో వాహనాన్ని ఏర్పాటుచేశాం. ఆ దానిని నిలిపి.. డ్రైవర్ను కొట్టారు. ఆ విషయం తెలిసి మేం ముగ్గురం అక్కడకు వెళ్లాం.. వెంటనే తమను గిరిజనులు చుట్టుముట్టి.. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- అటవీ శాఖ సిబ్బంది
ఇవీచూడండి: ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు