హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపానికి గురై.. ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫతేనగర్ శివశంకర్‌నగర్‌లో నివాసముంటున్న పవన్ నిమ్కర్... ఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. పవన్‌కు ప్రియాంకతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక నిమ్కర్... సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
అనుమానంతోనే గొడవలా...?
ఎప్పుడూ సోషల్ మీడియాతో బిజీగా ఉండటాన్ని సహించని భర్త పవన్.. ప్రియాంకను పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకుండా మొబైల్‌తోనే కాలం గడపటం ఇద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. తనపై అనుమానంతోనే పవన్ ఇలా తనను నియంత్రిస్తున్నాడని కోపం పెంచుకున్న ప్రియాంక.. పవన్‌ను సూటిపోటి మాటలతో బాధపెట్టటం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య నాలుగైదు రోజుల నుంచి ఘర్షణలు పెరగాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
మనస్థాపంతో ఆత్మహత్య..!
తనను పట్టించుకోవటం మానేసి.. సూటిపోటి మాటలతో ఇబ్బందిపెడుతూ... తిరిగి తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న మనస్థాపంతో పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
డబ్బులు డిమాండ్ చేసేది..
"ప్రియాంక ఎప్పుడూ మా తమ్ముడిని ఇబ్బంది పెడుతూనే ఉండేది. పెళ్లైన కొన్ని రోజులు మాత్రమే బాగుంది. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ గొడవలే. మా అమ్మనాన్నలు, ఇరుగుపొరుగు వాళ్లు ఎంత చెప్పినా... ఆమె తీరు మార్చుకోలేదు. పిల్లలు కలిగేందుకు వైద్యం చేయించుకుంటానని లక్ష రూపాయలు అడిగింది. అవి ఇవ్వకపోతే... విడాకులు ఇవ్వాలని... అందుకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీని గురించి మా తమ్మున్ని ఎప్పుడు తిడుతూనే ఉండేది. తన బాధ ఎవ్వరికి చెప్పకుండా.. మనసులో పెట్టుకుని కుమిలిపోయాడు. చివరికి ఇలా సూసైడ్ చేసుకున్నాడు."- పవన్ సోదరి.
మానసినకంగా వేధించేది...
"మా తమ్మున్ని ప్రియాంక ఎప్పుడు తిడుతూనే ఉండేది. ఎప్పుడు ఫోన్ చేసినా... ప్రేమగా మాట్లాడింది లేదు. ఏదో ఒక గొడవ గురించి చెబుతూనే ఉండేవాళ్లు. ఇంట్లో ఉండేది కాదు. ఎప్పుడు చూసిన వాళ్ల అమ్మవాళ్ల ఇంట్లోనే ఉండేది. మానసికంగా వేధించటం వల్లే... పవన్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు."- పవన్ సోదరుడు.
వేధింపులే కారణమా..?
ప్రియాంకపై మొదట స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పట్టించుకోకపోవటం వల్ల బాలనగర్ డీసీపీకి పవన్ కుటుంబసభ్యులు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గొడవలు కారణమా...? భార్య వేధింపులు కారణమా...? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అని లోతుగా విచారిస్తున్నారు.