Tractor Accident: బాజా భజంత్రీలు మోగవలసిన పెళ్లి ఇంట్లో... చావు డప్పులు మోగవలసిరావడం ఆ తండాలో తీవ్ర విషాదం నింపింది. పెళ్లి సామగ్రి కోసం వెళ్తూ ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారు పర్ష తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన గుగులోతు గోవిందు కూతురు వివాహం ఈనెల 24న జరగనుంది. దీంతో కుటుంబ సభ్యులంతా ట్రాక్టర్లో నర్సంపేట పట్టణానికి పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు తండా నుంచి బయలుదేరారు. తండా శివారులోని చెరువు కట్టపై నుంచి దిగుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడడంతో గూగులోతు గోవిందు, కాంతమ్మ, సీత అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. షాను, భిక్షపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగితా ఏడుగురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఓదార్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.
పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం. వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం. రేపు మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. -- పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే
ఎర్రబెల్లి దిగ్భ్రాంతి: ఈ ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఘటన గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: