Three Students died: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని నాట్కమ్ చెరువులో గల్లంతైన విద్యార్థులు మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉబేద్ పుట్టినరోజు వేడుక కోసం చీర్యాల లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి స్నేహితులు 10మంది వచ్చారు. కేకు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. ఈలోపు సరదాగా ఈత కొడదామని ముగ్గురు విద్యార్థులు చెరువులోకి దిగారు. లోతు అంచనావేయకపోవడం, ఈత రాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. ఈత వచ్చిన ఉబేద్ మిత్రులు బాలాజీ, హరిహరన్ కాపాడే ప్రయత్నంలో మునిగిపోయాడు. దైవదర్శనానికి వస్తే ముగ్గురు చనిపోవడం తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది.
సహాయక బృందాలు ముమ్మరంగా గాలించగా తొలుత హరిహరన్ మృతదేహం లభ్యమైంది. బాలాజీ, ఉబేద్ కోసం ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు వలల సాయంతో వెతికారు. ఆ తర్వాత బాలాజీ, ఉబేద్ మృతదేహాలను వెలికి తీశారు. మీర్‌పేట టీకేఆర్ కళాశాలలో డిప్లొమో చదువుతున్న విద్యార్థులు పారిశ్రామిక శిక్షణలో భాగంగా ఈసీఐఎల్‌కి వెళ్తున్న క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. చేతికి అందివచ్చిన కుమారులు దూరమడవంతో కన్నవారు తల్లడిల్లిపోయారు. ఘటనాస్థలిని పరిశీలించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈత రాని వారు చెరువులు, కుంటల్లోకి దిగవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సరదాగా వెళ్లి కన్నవారికి కన్నీళ్లు మిగిల్చొద్దని చెబుతున్నారు.
ఇవీ చదవండి: