Vikarabad Road Accident Today: వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మధానంతాంతపూర్ తండా, రేగొండి గ్రామాలకు చెందిన 10 మంది కూలీలు పనుల నిమిత్తం వికారాబాద్ అడ్డకు ఆటోలో వెళ్లారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం బ్రిడ్జి మలుపులో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో మృతి చెందిన వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను మాజీమంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరామర్శించారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ రాకపోవడంతో వీరిని ఇతర వాహనాలలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న క్రమంలో మరొకరు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యమంలో ఇంకొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో మృతులు సంఖ్య ఐదుకి చేరింది. మరో ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ఆటోను ఢీకొట్టిన లారీని తాండూరు పోలీసులు పట్టుకొని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ జమీల్, హేమ్లా, రవి, కిషన్, సోనీ భాయి మృతి చెందారని పోలీసులు తెలిపారు. బాధితులంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులుగా గుర్తించారు.
ఇవీ చూడండి..
రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం.. బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు