ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కొవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు మృతి చెందడం కలకలం సృష్టించింది. ఏలూరు కుమ్మరిరేవుకు చెందిన పి.దొరబాబు (45) గత నెల 25న కొవిడ్ బారినపడటంతో ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిరోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఆయనకు అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై 20 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. శనివారం అత్యవసర విభాగంలో దొరబాబుతోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో దొరబాబు భార్య, ఆయన కుటుంబ సభ్యులు ఆశ్రం ఆసుపత్రి ఎదుట ఆదివారం ఆందోళన చేశారు. అత్యవసర విభాగంలో ఆక్సిజన్ కొంతసేపు నిలిచిపోయిందని, అందుకే తన భర్త మృతి చెందాడని కనకదుర్గ ఆరోపించారు. అంతకుముందు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు, సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని అన్నారు. దీంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. అందుకే న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. భర్త చనిపోవటంతో కుటుంబానికి జీవనాధారం పోయిందని తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు.
‘దొరబాబుకు నెల రోజులుగా చికిత్స అందిస్తున్నాం. ఆయనకు మధుమేహం ఉంది. కొవిడ్ సోకడంతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో 20 రోజులుగా అత్యవసర విభాగంలో వెంటిలేటరుపై మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఆయనకు పెట్టిన వెంటిలేటర్ సరిగా పనిచేయకపోవడంతో శనివారం సిబ్బంది మరో వెంటిలేటర్‌ను అమర్చారు. ఆ తర్వాత రెండు గంటలకు చనిపోయారు. ఆక్సిజన్ అందలేదన్నది వాస్తవం కాదు. మిగిలిన ఇద్దరు కూడా ఆరోగ్యం బాగా క్షీణించడంతోనే చనిపోయారు’ -డాక్టర్ రవికుమార్, ఆశ్రం ఆసుపత్రి ఇన్‌ఛార్జి
వైద్యుల నిర్లక్ష్యమని తేలితే కఠిన చర్యలు..
ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడు దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం, ఆక్సిజన్ అందకపోవడమే కారణమని నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. -మంత్రి ఆళ్ల నాని
ఇదీచదవండి: TS CORONA CASES: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు