Farmers Committed to Suicide: తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు రైతులు ప్రాణాలు వదిలారు. అప్పులు తీర్చలేక, పంట చేతికి రాక ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా అమనగల్ గ్రామానికి చెందిన దేవిరెడ్డి వెంకట్ రెడ్డి (40)కి 2 ఎకరాల్లో మిరప, 3 ఎకరాల్లో వరి, ఎకరం భూమిలో పత్తి సాగు చేశారు. తెగుళ్లతో మిరప, పత్తి దిగుబడి రాలేదు. కొన్నేళ్లుగా పంటలకు పెట్టుబడి కోసం చేసిన అప్పు, బ్యాంకు రుణాలు కలిపి రూ.10 లక్షల వరకు అయ్యాయి. వాటిని ఎలా తీర్చాలన్న మనోవేదనతో సోమవారం పురుగుల మందు తాగారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన కాల్వ కృష్ణా రెడ్డి(52) 10 ఎకరాల్లో వేరుసెనగ, పత్తి వేయగా దిగుబడులు సరిగా రాలేదు. ఇటీవలే కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడంతోపాటు కుమారుడి వివాహం చేశారు. దిగుబడులు సరిగ్గా రాక ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మానసిక ఒత్తిడికి గురయ్యారు. అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరివేసుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన బోయ పరుశరాముడు (37) ఎకరాలో మిరప, రెండు ఎకరాల్లో పత్తి వేశారు. రెండు పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి కూడా రాలేదు. సోమవారం శాంతినగర్ వచ్చి పురుగు మందు కొనుగోలు చేసుకుని గ్రామానికి వెళ్లే దారిలోనే తాగారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందారు.
ఇదీ చూడండి: చడీ చప్పుడు లేకుండా గుట్టుగా పోస్టులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు