సరైన దిగుబడి లేక.. పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని స్థితిలో రైతన్నలు బలవన్మరనానికి పాల్పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో.. ఒకే రోజు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఊకలవేలీలోని మల్లయ్య అనే రైతుకు ఎకరం భూమి ఉండగా.. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో సగం పంట నాశనం కాగా.. చీడపీడల వల్ల మిగతా పంట పాడైంది. దీంతో చేసిన అప్పును ఎలా తీర్చాలో అన్న దిగులుతో పది రోజుల క్రితం పురుగుల మందు తాగగా.. మంగళవారం మృత్యువాతపడ్డాడు.
ఎలుకుర్తి హవేలీకి చెందిన లింగారెడ్డి అనే మిరప రైతుకు రెండెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. అయితే చీడపీడలు, అధిక వర్షాలతో పంట మొత్తం దెబ్బతింది. దీంతో రూ.3 లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. బాకీలు ఎలా తీర్చాలన్న దిగులుతో పొలం వద్ద పురుగుల మందు తాగి ప్రాణాలొదిలాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన బానయ్య అనే అన్నదాత పదిహేను రోజుల క్రితం ధాన్యాన్ని విక్రయించడానికి కేంద్రంలో ఉంచాడు. కేంద్రంలో సమయానికి కొనుగోలు చేపట్టలేదు. దీంతో ఇటీవల అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది. పెట్టుబడి పెట్టిన మేర రాబడి రాలేదని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలే పంట దిగుబడి సరిగ్గా లేక చితికిపోతున్న రైతన్నకు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: పిల్లలతో కలిసి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..!
యువతిని బంధించి 12 రోజులుగా రేప్.. అబార్షన్ మాత్రలు వేసుకొని మహిళ మృతి