మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్లలో ఈ మధ్యే జరిగిన ఓ దొంగతనానికి సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోటర్‌సైకిల్‌పై వెళ్తున్న పాతనేరస్థుడు ఎరుకలి శ్రీను అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా దొంగతనాలు ఒప్పుకున్నాడని ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. శ్రీను హత్య కేసుతోపాటు 12 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. 11తులాల బంగారం, 99 తులాల వెండి ఆభరణాలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
మరో కేసులో, దేవరకద్రకు చెందిన రమేష్‌రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. రమేష్ ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేయడం తెలియని వారికి సహాయపడుతున్నట్లుగా నటించి వారి నుంచి పిన్ నెంబర్ తెలుసుకుంటాడని తెలిపారు. తర్వాత కార్డు పని చేయడం లేదండూ కార్డు మర్చి ఇస్తాడని చెప్పారు. అనంతరం మరో ఏటీఎంలో మోసపూరితంగా నగదు తీసుకుంటాడని ఎస్పీ పేర్కొన్నారు. ఓ ఏటీఎం కేంద్రం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండడాన్ని గమనించిన మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మోసం చేసి నగదు తీసుకున్నట్లు తెలిపారన్నారు. ఇతని నుంచి 2లక్షల 62 వేల 900 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: Crime: అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న జగిత్యాల పోలీసులు