జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి సర్కిల్ పరిధిలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని కోరుట్ల పోలీసులు.. చాకచక్యంతో పట్టుకున్నారు. కోరుట్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా.. అతడిని సీఐ రాజశేఖర రాజుతో పాటు సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి అని గత పదేళ్లుగా నల్గొండ, జనగాం, వరంగల్, సూర్యాపేట, భువనగిరి, ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసినట్లు సీఐ తెలిపారు.
కొన్ని రోజులు శిక్ష అనుభవించాక మళ్లీ కోరుట్లలో ఉంటూ గ్యాస్ స్టవ్ రిపేర్, మంచాలు అల్లుతామంటూ పట్టణంలో తిరిగేవాడని సీఐ చెప్పారు. ఆ సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి.. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసేవాడు. ఇలా పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు. దొంగిలించిన సొత్తును జల్సాలకు ఖర్చు చేసేవాడు. చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్న అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: ఇళ్లకు తాళాలు.. రెచ్చిపోతున్న చోరులు!