టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్‌కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు... దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్‌ను ప్రశ్నిస్తున్నారు. పూరి జగన్నాథ్ వెంట ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా ఈడీ దర్యాప్తు కొనసాగనుంది. మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరించనున్న ఈడీ.. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుంచి సమాచారం సేకరించింది. సినీరంగానికి చెందిన 12 మంది బ్యాంకు ఖాతాలు పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం.
12 మంది ప్రస్తావన లేకుండానే...
సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారించనుంది. నేటి నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్స్ కేసులో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన ఆబ్కారీశాఖ సిట్... 11 నేరాభియోగ పత్రాలు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని విచారించిన సిట్... ఆఫ్రికన్ దేశాలకు చెందిన 8 మందిని నిందితులుగా చూపింది. మరికొంత మందిని కూడా నిందితులుగా చూపింది. సినీ రంగానికి చెందిన 12 మందిని విచారించిన సిట్... నేరాభియోగ పత్రాల్లో మాత్రం 12 మంది గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
ఎవరెవరు ఎప్పుడంటే...
మనీ లాండరింగ్ చట్టం కింద 12మంది సినీ రంగానికి చెందిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని సూచించింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఛార్మి, 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు.
ఇవీ చూడండి: