ఓ యువకుడు దారుణ హత్య(Murder)కు గురైన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ శివారులో... మిషన్ భగీరథ ఉపరితల ట్యాంకు కింద మంగళవారం వెలుగుచూసింది. గ్రామీణ వలయాధికారి ముత్తినేని సత్యనారాయణ, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం ట్యాంకు పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతుండడంతో.. మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దామరచర్ల మండల కొండ్రపోల్‌కు బొమ్మకంటి నాగయ్య(32)గా గుర్తించారు. తలపై, కాలుకు, శరీరంపై పలుచోట్ల గాయాలు గుర్తించామన్నారు. మండల పరిధిలోని లక్ష్మిపురం గ్రామంలో నాగయ్యకు దూరపు బంధువులు చేసిన... ఎల్లమ్మ పండుగకు సోమవారం మధ్యాహ్నం వచ్చారు.
అందులో భాగంగా కొత్తగూడెం గ్రామశివారులో గల వైన్స్ వద్ద అదే రోజు సాయంత్రం మద్యం తాగారు. ఆ తరువాత నాగయ్య అక్కడకు ఎలా వెళ్లాడు, ఎవరు తీసుకెళ్లారనే విషయంపై పోలీసులు ఆరా తీరుస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలయాధికారి తెలిపారు. ఘటనా స్థలానికి డీఎస్పీ వెంకటేశ్వరరావు, శాసనసభ్యుడు నల్లమోతు భాస్కరరావు చేరుకుని పరిశీలించారు. నాగయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాగయ్య మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నాగయ్య టిప్పర్ డ్రైవర్గా పని చేసేవాడు. అతడిని ఇంత దారుణంగా హత్య(Murder) చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. వివాహేతర సంబంధం, ఆస్తి వివాదం, భూముల గొడవల ఏవైనా ఉన్నాయి అనే తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: MURDER ATTEMPT: తల్లికి చేబదులు ఇవ్వలేదని.. యువకుల క్రూరత్వం!