Hawala Cash Seized in Begumbazarr: మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో హవాలా నగదు భారీగా పట్టుబడుతోంది. హవాలా నగదు, అక్రమ మద్యం అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు.. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా ఈరోజు బేగంబజార్‌లో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కేవల్ రామ్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ.48.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదును, వ్యాపారిని తదుపరి విచారణ నిమిత్తం బేగంబజార్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. నగదును న్యాయస్థానంలో డిపాజిట్ చేసిన పోలీసులు.. ఆ వ్యాపారికి నోటిసులు ఇచ్చారు.
ఉదయం రూ.70 లక్షలు..: ఉదయం కూడా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రూ.70 లక్షల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఓ కారు ఆగకుండా చెక్‌పాయింట్ దాటి వెళ్లిపోవడం గమనించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తరవాత కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా.. నోట్ల కట్టలు ఉన్న బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో రూ.70 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి రశీదు లేవు. డబ్బుకు సంబంధించి పట్టుబడిన వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: