son killed mother: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ కొనివ్వలేదని కుమారుడు తల్లిని హతమార్చాడు. శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (52), వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్ ఇంటర్ పూర్తి చేసి కూలి పనులకు వెళ్తుండేవాడు. ఇటీవల స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లితో నిత్యం గొడవపడుతున్నాడు. డబ్బులు లేవని తల్లి మందలిస్తూ వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ కోసం మహేశ్ తల్లితో మరోసారి గొడవపడ్డాడు. ఆవేశంలో రోకలిబండతో తల్లి తలపై కొట్టడంతో ఆమె తీవ్రగాయాలై కిందపడిపోయింది. 108 అంబులెన్సు సిబ్బంది వచ్చేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మి అక్క దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇటీవల లక్ష్మి మరో కుమారుడు సాల్‌మన్ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని గాయపరిచిన కేసులో జైలుకు వెళ్లాడని గ్రామస్థులు తెలిపారు. దీంతో మహేశ్ క్షణికావేశానికి లోనై మూడు రోజుల కిందట పొలాల్లో మిరప కట్టెకు నిప్పు పెట్టి అందులోకి దూకడంతో చేతులకు గాయాలయ్యాయని అన్నారు. కుమారుడి గాయాలకు మందు పూసేందుకే లక్ష్మి కూలి పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉందని.. అతడి చేతిలోనే హతమైందని చుట్టుపక్కలవారు ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇంత ఘోరం ఏవరికి రాకూడదు. లక్ష్మి చాలా కష్టపడి పిల్లలను పోషిస్తోంది. కుమారులు మాత్రం గ్రామంలో జులాయిగా తిరిగేవారు. ఈ సంఘటన ఏ తల్లిదండ్రులకు జరగకూడదు. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కొడుకు చేతిలోనే ప్రాణంపోయింది."
-గ్రామస్థులు
ఇదీ చదవండి: ఆటో బోల్తా పడి తల్లి, కుమార్తె మృతి.. నలుగురికి గాయాలు