మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు.
కౌకూరు భరత్‌నగర్‌లో రాజు అలియాస్ ఏసు(38) ఒంటరిగా నివసిస్తున్నాడు. పక్కనే మరో గదిలో తల్లి ఉంటున్నారు. బుధవారం పెరుగు విక్రయించేందుకు వచ్చిన ఓ మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె విషయాన్ని భర్తకు తెలిపింది. అతడు రాజును నిలదీశాడు. ఆగ్రహానికి గురైన స్థానికులు అతనిపై దాడి చేశారు. రాజు ఘటనాస్థలిలోనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
రాజుకు అప్పుడప్పుడు మానసికస్థితి సరిగా లేదని స్థానికులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. తన కుమారుడిపై కావాలనే దాడి చేసి హత్య చేశారని మృతుడి తల్లి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అంగన్వాడీకి రావడం లేదని చిన్నారికి వాతలు