Road Accident at Nakerekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. తాటికల్ ఫ్లైఓవర్ వద్ద సూర్యాపేటలో పీజీఎఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులు స్వల్పంగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నకిరేకల్, సూర్యాపేట, నల్లొండలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హరీశ్‌రావు... విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వెల్లడించిన వైద్యులు 15 మంది గాయపడ్డారని తెలిపారు.
ఈరోజు ఉదయం సూర్యాపేటలో పీజీఎఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్గొండలో ఎగ్జామ్ రాసేందుకు బయలుదేరారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై తాటికల్ ఫ్లై ఓవర్ నుంచి నల్గొండ వైపుకు వెళుతున్న సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో.. వెనుక వైపు నుంచి వస్తున్న లారీ కాలేజ్ బస్సును బలంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో విద్యార్థినుల బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో సుమారు కాలేజ్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు.
అందులో 30 మందికి స్వల్పంగా, 10 మంది విద్యార్థినులకు తీవ్రంగా గాయాలయ్యాయి. విద్యార్థుల అర్తనాదాలతో.. జాతీయ రహదారి వద్ద హృదయ విదారక పరిస్థితి నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అంబులెన్స్‌లలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట, నల్గొండలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: