Kamareddy Road Accident: అతివేగం కారణంగా తొమ్మిది మంది బలైన దుర్ఘటనలో డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నట్లు... గాయపడినవారు చెబుతున్నారు. డ్రైవింగ్ చేయొద్దని చెప్పినా వినకుండా... మత్తులో డ్రైవింగ్ చేశారని పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిన్న ఎల్లారెడ్డి సమీపంలో టాటా ఏస్ లారీని ఢీకొనగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఓ కుటుంబం దశదిన కర్మ అనంతరం... ఎల్లారెడ్డిలో అంగడి దింపుడుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
'నిన్న మార్కెట్ ఉంటే ఎల్లారెడ్డికి అంగడి దింపుడుకి వెళ్లాం. పోయేటప్పుడు మంచిగానే వెళ్లాం. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడు. డ్రైవింగ్ చేయొద్దని చెప్పినా వినకుండా... మత్తులో డ్రైవింగ్ చేశాడు. వాహనాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ రోడ్డు కిందకు తప్పించినా లాభం లేకపోయింది. డ్రైవర్ అతివేగంతో... నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద లారీని ఢీకొట్టాడు.'-క్షతగాత్రులు
'అంగడిదింపుడుకి ఎల్లారెడ్డికి తోల్క పోయిండు. పోయేటప్పుడు మంచిగానే వెళ్లాం. వచ్చేటప్పుడు డ్రైవర్ బాగా తాగిండు. నా భర్త నడుపుతా అన్న తాళం చెవి ఇవ్వలేదు. మత్తులో వేగంగా డ్రైవింగ్ చేస్తూ లారీని ఢీకొట్టాడు.'-బాధితురాలు
ఎల్లారెడ్డి ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని... బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50 వేలు సాయం ప్రకటించారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
'ఈ సంఘటన చాలా దురదదృష్టకరం. హసన్‌పల్లి వద్ద భయంకరమైన ఘటన జరిగిపోయింది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించవద్దు. సురక్షిత ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి.'- శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఎస్పీ
ఇదీ చదవండి:Road Accident In Kamareddy: తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న అతివేగం..