యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో దొంగతనం అభియోగంతో పోలీసుల చేతిలో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Batti Vikramarka) డిమాండ్ చేశారు. పోలీసుల దెబ్బలకు గాయపడి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోన్న మృతురాలి కొడుకు ఉదయ్ కిరణ్‌ను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
మరియమ్మను మూడు స్టేషన్లకు తిప్పుతూ దారుణంగా కొట్టి చంపారు. కూతురు చూస్తుండగానే చిత్ర హింసలకు గురి చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల ఆకృత్యాలు పెరిగి పోయాయి. పోలీసులు.. విచారణ పేరిట ఏళ్ల తరబడి ఎంతోమంది ప్రాణాలు తీశారు. సీఎం కేసీఆర్.. పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల.. సామాన్యులెవరూ బతికే పరిస్థితి కనిపించడం లేదు. దళితుల సాధికారత కోసమే పని చేస్తున్నామని చెప్పుకునే కేసీఆర్.. ఘటనపై కనీసం స్పందించలేదు.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
అనంతరం.. భట్టి జిల్లా కలెక్టర్‌ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: