mother sold her child: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఓ మహిళ నవంబరు 24న సీకేఎం ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలుండగా, మూడో కాన్పులోనూ కుమార్తె జన్మించడంతో ఆ శిశువును వేరొకరికి విక్రయించింది. ఈ తంతుకు ఆస్పత్రిలోని ఓ ఆరోగ్య కార్యకర్త మధ్యవర్తిగా వ్యవహరించింది. ఆ పసికందును హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురానికి చెందిన దంపతులకు విక్రయించారు. ప్రసవానంతరం ఇంటికి వెళ్లిన మహిళను.... ఇల్లంద గ్రామ అంగన్వాడీ కార్యకర్త ఆరాతీయగా.. శిశు విక్రయం వెలుగులోకి వచ్చింది.
రంగంలోకి దిగిన అధికారులు
ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త.. జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారులు, జిల్లా బాలల సంక్షేమ సంఘం దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు ముందుగా హనుమకొండ జిల్లా అధికారులతో కలసి ధర్మసాగర్ మండలం ధర్మాపురం గ్రామానికి వెళ్లి శిశువును తీసుకెళ్లిన వారిని విచారించారు. ముందు బుకాయించినా.. అధికారుల మందలింపుతో అంగీకరించారు.
శిశువును తల్లి వద్దకు చేర్చిన అధికారులు
ఇల్లందలోని శిశువు తల్లిదండ్రులను, ధర్మాపురానికి చెందిన దంపతులను పిలిపించిన అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శిశువును సొంత తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువు విక్రయనికి సహకరించిన ఆరోగ్య కార్యకర్త వివరాలు సేకరించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Mother Killed a Baby Girl : ఆడపిల్ల పుట్టిందని అమ్మే చంపేసింది