Fake consultancies in warangal: విదేశాల్లో చదువుకోవాలన్నది కొందరి యువకుల కోరిక. వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న కొన్ని కన్సలెన్ట్సీలు.. డబ్బులు దండిగా ఇస్తే చాలు.. సరైన అర్హత లేకున్నా మేం పంపిస్తామంటూ ముందుకు వస్తున్నాయి. వారి వలలో చిక్కుకున్న యువకులు.. అడిగినంత డబ్బు కట్టేస్తున్నారు. ఈ క్రమంలో యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి.. వారికి నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి పంపించే తంతుకు వరంగల్ పోలీసులు చెక్ పెట్టారు. దేశంలో గుర్తింపు పొందిన 11 వర్శిటీల నుంచి ఉత్తీర్ణత పొందినట్లుగా నకిలీ డిగ్రీ, పీజీ ఇతర కోర్సుల సర్టిఫికెట్లు సృష్టించి.. మోసపుచ్చే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. కాకతీయ, ఆంధ్రా యూనివర్శిటీలతో పాటు దేశంలోని మిగతా వర్శిటీల సర్టిఫికెట్లూ ఈ ముఠా సభ్యులు నకిలీవి సృష్టించేశారు.
అసలైన సర్టిఫికెట్లలా
విద్యార్ధులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాకున్నా మంచి మార్కులతో పాసైనట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి దందా సాగించారు. ఎవరికీ అనుమానం రాకుండా వర్శిటీ స్టాంపులను ముద్రించి.. అసలైన సర్ఠిఫికెట్ల మాదిరిగా నకిలీవి తయారు చేశారు. ఈ ముఠాకు సంబంధించి మొత్తం 12 మంది పోలీసులకు చిక్కగా... మరో ముగ్గురు తప్పించుకుపారిపోయారు. వీరి వద్ద నుంచి 212 సర్టిఫికెట్లు, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 12 సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, ప్రింటర్ రోలర్స్ తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్‌లో ఇలా 9 కన్సలెన్ట్సీలను గుర్తించాం. వారి నుంచి 212 నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నాం. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ. 4 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యాలయాలు మంచి గ్రేడింగ్ ఉంటే విద్యార్థులను తీసుకుంటున్నారు. కోర్సు మధ్యలో అవి నకిలీ అని తెలిస్తే వారిని తొలగిస్తారు. దీంతో విద్యార్థుల జీవితం మధ్యలోనే నాశనమవుతుంది. ఇలా మోసం చేస్తూ కాకుండా చదువుకుని మంచి మార్కులతో విదేశాలకు వెళ్లాలి. లేదంటే చిక్కులు తప్పవు. -తరుణ్ జోషి, వరంగల్ సీపీ
చిక్కులు తప్పవు
సర్ఠిఫికెట్ల తయారీలో నిందితులు దారా అరుణ్, మాదాడి శ్రీకాంత్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వర్శటీ ఫీజు ఒక్కడే కాకుండా రూ. 4 నుంచి 5 లక్షల మేర అదనంగా రుసుం వసూలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. కన్సెల్టెన్సీల మాయజాలంలో చిక్కుకోకుండా... విద్యార్ధులు కష్టపడి చదివి మార్కులు తెచ్చుకుని విదేశాలకు వెళ్లాలని సూచించారు. నకిలీ ధ్రువపత్రాలతో వెళితే చిక్కులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు ఈ తరహా నకిలీ ధ్రువపత్రాలతో విదేశాలకు వెళ్లిన 62 మంది వరంగల్ విద్యార్ధులను గుర్తించినట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు.
ఇదీ చదవండి: Local cadre Report: సొంత జిల్లాలకు ఉద్యోగులు... తొలిరోజు 25 శాతం మంది రిపోర్ట్