Cheating by income tax raids: పోలీసు/సీబీఐ/ఆదాయపన్ను/విజిలెన్స్ విభాగాల అధికారులమంటూ మాయగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాల ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కల్లోలం నుంచి బయటపడి వ్యాపార లావాదేవీలు ఊపందుకోవడంతో మళ్లీ ఈ ముఠాలు నగరాల్లోకి చేరి ఉండవచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎవరైనా వచ్చి వ్యక్తిగత, ఆస్తి లావాదేవీల వివరాలు అడిగితే నమ్మవద్దంటున్నారు.
ఎంతవరకైనా అనుసరిస్తారు!
ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సూడో అధికారుల ముఠాల శైలి వేరు. పన్నులు చెల్లించకుండా ఆభరణాలు క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై గురిపెడతారు. ఆభరణాలు దుకాణాలకు ఇచ్చేందుకు బయల్దేరినప్పుడు వీరు సిద్ధమవుతారు. వారు ప్రయాణించే మార్గాల్లోనే వీరూ వెళ్లి.. ఆదాయ పన్ను శాఖ/ పోలీసు అధికారులమంటూ భయపెట్టి వారు తేరుకునేలోపే వాటిని కొట్టేస్తారు.
రెక్కీతో పక్కా వ్యూహం
ఒక్కో ముఠాలో 4-5 మంది సభ్యులుంటారు. రాజకీయ, వ్యాపార వర్గాలే వీరి లక్ష్యం. వారి కార్యాలయాలు/నివాసాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో స్నేహం పెంచుకుంటారు. ఇల్లు, వ్యాపార వ్యవహారాల వివరాలన్నీ సేకరించాక రంగంలోకి దిగుతారు. ప్రముఖుల నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు ఆయా శాఖల అధికారులు ఎలా వ్యవహరిస్తారనే అంశాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటారు. అవసరమైతే రిహార్సల్స్ చేస్తారు. ఆదాయపన్ను శాఖకు లెక్కచూపని నగదు, విలువైన ఆభరణాలు మోసగాళ్లు ఊడ్చుకెళ్లినా.. కొంతమంది బాధితులు పెదవి విప్పట్లేదు.
సీబీఐ ఏజెంట్లమంటూ బురిడీ!
Cheating by cbi raids: అది ఐటీ కారిడార్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న అపార్ట్‌మెంట్ సముదాయం. నలుగురు వ్యక్తులు సీబీఐ ఏజెంట్లమంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించి ఉన్నదంతా దోచుకుని ఉడాయించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మంగళవారం మీడియా సమావేశంలో పలు వివరాలు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వెంకటసుబ్రహ్మణ్యం భువన తేజ డెవలపర్స్ స్థిరాస్తి సంస్థ నిర్వహిస్తున్నారు. భార్యాపిల్లలతో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీ అపార్టుమెంట్స్‌లోని ఫ్లాట్ 110లో ఉంటున్నారు. ఆయన సోమవారం ఉదయం పనిమీద బయటకు వెళ్లగా ఇంట్లో భార్య భాగ్యలక్ష్మి, పని మనిషి స్వామి ఉన్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు కారులో నలుగురు వ్యక్తులు అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చారు. వెంకటసుబ్రహ్మణ్యంను కలవాలంటూ భద్రతా సిబ్బందికి చెప్పి లోపల చేరారు. ఒకరు పార్కింగ్ చోటే ఉన్నారు. ముగ్గురు 110 ఫ్లాట్‌కు వెళ్లారు. తాము సీబీఐ ఏజెంట్లమంటూ భాగ్యలక్ష్మికి గుర్తింపు కార్డులు చూపారు. ఇంట్లోవారి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఇల్లంతా సోదా చేయాలంటూ హడావుడి చేశారు. భాగ్యలక్ష్మి వద్ద చేతి సంచిని గుర్తించి అందులో లాకర్ తాళంచెవి తీసుకున్నారు. లాకర్లో 1.35 కిలోల బంగారు నగలు, రూ.2లక్షలు తీసుకుని సూట్‌కేసులో సర్దుకొని వెళ్లిపోయారు. పక్కా ప్రణాళికతో వచ్చిన ఆగంతుకులు అరగంటనే భారీ మొత్తం దోచుకుని దర్జాగా వెళ్లిపోవడం సంచలనంగా మారింది. కాపేటికి తేరుకున్న భాగ్యలక్ష్మి భర్తకు ఫోన్ చేశారు. వచ్చింది సీబీఐవారు కాదని తెలుసుకుని సాయంత్రం గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో నిందితులు!
స్థిరాస్తి వ్యాపారి వెంకటసుబ్రహ్మణ్యం గురించి పూర్తిగా తెలిసినవారే ఇలా పక్కా ప్రణాళికతో దోపిడీ చేసి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. నిందితులు వచ్చిన కారును సీసీఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఔటర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులను రాజమహేంద్రవరం వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆర్థిక వివాదాలు, వ్యాపార లావాదేవీల నేపథ్యంలో కూడా ప్రత్యర్థులు ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
ఇదీ చదవండి: Karvy Scam: కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ రూ.3520 కోట్ల మోసం