Triple murder in dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఈ నెల 7 న అర్ధరాత్రి ముగ్గురిని కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు 19 ఏళ్ల యువకుడని, మద్యం మత్తులో నగదు కోసం హతమార్చాడని నిజామాబాద్ సీపీ కార్తికేయ ఆదివారం.. విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డిచ్‌పల్లిలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న హార్వెస్టర్ షెడ్డులో హర్పాల్‌సింగ్, జోగిందర్‌సింగ్, సునీల్ దారుణహత్యకు గురికాగా.. డిచ్‌పల్లి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో నివసిస్తున్న 19 ఏళ్ల గంధం శ్రీకాంత్‌ని హంతకుడిగా గుర్తించారు. 15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలకు అలవాటు పడిన శ్రీకాంత్.. ఆ రోజు మద్యం మత్తులో నగదు కోసం ఆ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్లినట్లు సీపీ తెలిపారు. తొలుత బయట మంచంపై నిద్రిస్తున్న సునీల్ తలపై సుత్తితో దాడి చేసి చంపేశాడు. అక్కడే షెడ్డులో మద్యం సీసా కనిపించడంతో తాగాడు. తర్వాత హర్పాల్‌సింగ్, జోగిందర్‌సింగ్‌లపై వరుసగా సుత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం వారి సెల్‌ఫోన్లు, రూ.2,800 నగదు అపహరించుకెళ్లాడు. మృతులు ముగ్గురూ మద్యం తాగి గాఢనిద్రలో ఉండటంతో శ్రీకాంత్‌కు ఎక్కడా ప్రతిఘటన ఎదురుకాలేదని పోలీసులు వర్గాలు తెలిపాయి.
మద్యం మత్తులో
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులకు ఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఇటీవల జైలు నుంచి విడుదలైన పాత నేరస్థుల కోణంలో విచారించి నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనాలు చేసే అలవాటు ఉన్న శ్రీకాంత్ పాత కేసుల్లో అరెస్టయి ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. మద్యం మత్తులో ఆరోజు రాత్రి డబ్బుల కోసం షెడ్ వద్ద నిద్రిస్తున్న ముగ్గురిని హతమార్చి రెండు ఫోన్లు, నగదు అపహరించి నిందితుడు పారిపోయాడు.
అలా దొరికాడు
ఆ సెల్‌ఫోన్లలో సిమ్‌లను తీసేసిన నిందితుడు.. తర్వాత అందులో ఒక ఫోన్‌లో తన సిమ్‌కార్డు వేశాడు. హత్యకు గురైన వారి సెల్‌లో వేరొకరి సిమ్ వేసినట్లు పోలీసులకు సాంకేతిక ఆధారం లభించడంతో.. లొకేషన్ ఆరా తీసి నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో నిందితుడిని పట్టుకున్నారు. దర్యాప్తులో తానే హత్యలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని నుంచి మృతుల సెల్‌ఫోన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018లో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన శ్రీకాంత్‌ను పోలీసులు అప్పట్లో బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. నిందితుడి కుటుంబసభ్యుల వివరాలు వెల్లడికాలేదు. అతడు నెల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: Chili crop farmer suicide: ఆశించిన దిగుబడి రాదని మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య