Ganja smuggling via hyderabad: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి మహారాష్ట్రకు లారీలో తరలిస్తున్న 1,820 కిలోల గంజాయిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని లారీలో కింద పెట్టి... వాటిపై వర్మీ కంపోస్టు ఎరువుల సంచులను నింపారు. గంజాయి వాసన గుర్తించకుండా వర్మీ కంపోస్టు వేయడంతో ఎవరికీ అనుమానం రాదని నిందితులు భావించారు. కానీ రాచకొండ ఎస్ఓటీ(Rachakonda police seized ganja in hyderabad) పోలీసులు పక్కా సమాచారంతో లారీని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ బాహ్యవలయ రహదారి వద్ద పట్టుకున్నారు.
సీజనల్ బిజినెస్ పేరుతో
గంజాయి సరఫరాదారులు రెండు ముఠాలుగా విడిపోతున్నారు. ఒక ముఠా కారులో ముందు వెళ్తుంది. పోలీసుల తనిఖీలు లేవని నిర్ధరించుకున్న తర్వాత లారీలో ఉండే మరో ముఠాకు సమాచారం ఇస్తుంది. ఆ తర్వాతే లారీ ముందుకు కదులుతుంది. ఒకవేళ చెక్‌పోస్టులో తనిఖీలు ఉన్నట్లు కారులో ఉన్న ముఠా గుర్తించిన వెంటనే లారీ డ్రైవర్‌కు సమాచారం అందించి లారీని రహదారి పక్కకు మళ్లిస్తారు. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రధానంగా గంజాయి స్మగ్లర్లు సీజనల్ బిజినెస్ పేరుతో వాహనాల్లో సరుకులు తీసుకెళ్తున్నారు. పైకి ఆ సరుకులు ఉన్నా... వాటి కింద మాత్రం గంజాయిని ఉంచుతున్నారు. పోలీసులు తనిఖీ చేసినా పైన ఉన్న సరుకులను మాత్రమే చూసి వదిలేస్తున్నారు.
అదే వారికి సదవకాశం
విజయవాడ- హైదరాబాద్(Ganja smuggling in telangana) జాతీయ రహదారి మీదుగా రోజూ వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి వాహనాన్ని పోలీసులు నిలిపి తనిఖీ చేసే అవకాశం ఉండదు. ఇది శ్రమతో కూడుకున్న వ్యవహారంతో పాటు... సమయం కూడా ఎంతో వృథా అవుతుంది. అందుకే పక్కా సమాచారం ఉన్న వాహనాలను పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
'విశాఖ నుంచి అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్'
మూడు రెట్లు విక్రయం
విశాఖ ఏజెన్సీతో పాటు... తూర్పుగోదావరి జిల్లాల్లోనూ గంజాయిని(ganja seized in hyderabad) టన్నుల కొద్దీ పండిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హైదరాబాద్, కర్నాటక, తమిళనాడుకు చెందిన ముఠాలు రైతులకు డబ్బులు ఇచ్చి మరీ గంజాయిని సాగు చేయిస్తున్నాయి. ఈ ముఠాల వెనక పెద్ద వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్ర- ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వెళ్లలేని ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. శీలావతి రకం గంజాయికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ రకం గంజాయిని క్వింటాల్‌కు రూ. 5వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు.. వివిధ రాష్ట్రాలకు తరలించి రూ. 10-15 వేలకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి వాహనాల్లో ఉతర భారతదేశానికి తరలించాలంటే... హైదరాబాద్ మీదుగానే రహదారి సౌకర్యంగా ఉంటుంది. ఖమ్మం నుంచి వరంగల్, కరీంనగర్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... అక్కడ వాహనాల రాకపోకలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పోలీసులు సులభంగా గుర్తిస్తారనే ముందు చూపుతో స్మగ్లర్లు జాతీయ రహదారివైపే మొగ్గుచూపుతున్నారు.
సాగు, సరఫరా కట్టడి చేస్తే
రాచకొండ పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5వేల కిలోల గంజాయి(hyderabad police seized ganja smuggling gang)ని పట్టుకుని 31మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో 8మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తరచూ గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన 34 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. పోలీసులు విశాఖ ఏజెన్సీలో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చే వాహనాల సమాచారం సేకరిస్తున్నారు. తెలంగాణ నుంచి ఓ పోలీసు అధికారి కూడా విశాఖపట్నంలో ఉండి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని వివరాలు సేకరించి ఇక్కడి పోలీసులకు అందిస్తున్నారు. సాగుదారులను, సరఫరాదారులను కట్టడి చేయగలిగితే గంజాయి రవాణాను అడ్డుకోవచ్చని పోలీసులు తుది నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటకలకు చెందిన స్మగ్లర్ల వివరాలు సేకరించి ఆయా రాష్ట్రాల పోలీసులతో తెలంగాణ పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు.
ప్రత్యేక బృందాలతో
కానీ ఈ క్రమంలో పోలీసులకు కేవలం వాహనదారులు మాత్రమే పట్టుబుడుతున్నారు. ప్రధాన నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. ప్రధాన నిందితులకు సంబంధించిన వివరాలను ఆయా రాష్ట్రాల పోలీసులకు పంపిస్తున్నారు. గంజాయి పట్టుకునే పోలీసులకు నగదు ప్రోత్సాహం అందించడంతో పాటు... పదోన్నతులనూ పరిగణలోకి తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: Ganja seized in Hyderabad today : హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత