కరోనా చికిత్స అనంతరం కొందరికి సోకుతున్న మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్(Black Fungus)) చికిత్సలో వినియోగించే ‘పొసకొనజోల్’ ఔషధాలకు నకిలీల(Counterfeit Drugs)ను తయారుచేస్తున్న ముఠా పట్టుబడటం కలకలం సృష్టిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లతో నకిలీ ఔషధాల(Counterfeit Drugs)ను స్వాధీనం చేసుకున్న అక్కడి అధికారులు హైదరాబాద్ కేంద్రంగా అవి తయారైనట్లు గుర్తించి తెలంగాణలోని ఔషధ నియంత్రణ సంస్థ అధికారులను అప్రమత్తం చేశారు. అయితే.. ఇక్కడి అధికారులు నెల క్రితమే వాటిని గుర్తించి సీజ్ చేశారని తెలిసింది. ఇతర రాష్ట్రాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలూ పంపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గిరాకీ చూసి రంగంలోకి
కొవిడ్ చికిత్స అనంతరం కొంతమంది బాధితులకు బ్లాక్‌ఫంగస్(Black Fungus) సోకుతోంది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాధితులు ఈ వ్యాధి బారినపడ్డారు. దీని చికిత్సకు కొన్నిరకాల ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘పొసకొనజోల్’. బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక కూడా.. బాధితులు ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. సాధారణంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇంజెక్షన్ రూపంలో లభించే ఔషధాన్ని, ఇంటికెళ్లాక మాత్రల రూపంలో ఔషధాన్ని వాడుతుంటారు. కనీసం 3-4 నెలలు వాడాల్సి వస్తుండడంతో వీటికి గిరాకీ ఏర్పడింది. 10 మాత్రలుండే సీసా గరిష్ఠ చిల్లర ధర రూ.8,000 వరకు ఉంది. నల్ల బజారులో వీటిని రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకూ విక్రయిస్తున్నారు.
నెల్లాళ్లూ కిక్కురుమనని అధికారులు!
గుజరాత్‌లో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్(Black Fungus) నకిలీ ఔషధాల(Counterfeit Drugs) మోసం మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. తెలంగాణలో పొసకొనజోల్ ఔషధం తయారీకి నాలుగు సంస్థలకు మాత్రమే అనుమతించారు. ‘ఆస్ట్రాజెనెరిక్స్’ అనే సంస్థ మరో ఉత్పత్తికి అనుమతి పొంది ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు. విశేషమేమిటంటే.. ఈ సంస్థ నకిలీ మందుల్ని తయారుచేస్తున్న విషయాన్ని తెలంగాణ ఔషధ నియంత్రణాధికారులు నెలరోజుల కిందటే గుర్తించారు. ఒక దానికి అనుమతి తీసుకొని.. మరోటి ఉత్పత్తి చేస్తున్నట్లుగా నిర్ధారించారు. దాదాపు రూ. కోటి విలువైన పొసకొనజోల్ ఔషధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే నమూనాలను తీసుకొని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. వాటిలో నాణ్యత ప్రమాణాలు లోపించినట్లు తేలింది.గుజరాత్ నుంచి కూడా ఫిర్యాదు రావడంతో గురువారం మరోసారి ఆ సంస్థలో అధికారులు తనిఖీ చేశారు. నెల కిందట స్వాధీనం చేసుకున్న రూ.కోటి విలువైన ఔషధాల కంటే ఎక్కువే ఉత్పత్తి చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. అంటే.. ఈ నెలరోజుల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమంది బాధితులు ఈ నకిలీ ఔషధాలను వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారో ఊహించలేమన్నమాట! నకిలీ ఉత్పత్తుల్ని గుర్తించిన వెంటనే ఇక్కడి అధికారులు ఇతర రాష్ట్రాలను ఎందుకు అప్రమత్తం చేయలేదనేది ప్రస్తుతానికి అంతుబట్టని ప్రశ్న.
మరికొన్ని సంస్థలపైనా..
హైదరాబాద్ నుంచి దేశవిదేశాలకు నాణ్యమైన మందులను సరఫరా చేస్తుంటారు. ఇదే క్రమంలో కొందరు నకిలీల(Counterfeit Drugs) దందా చేస్తున్నట్లు తాజాగా బయటపడింది. అనుమతి పొందిన ఉత్పత్తులను కాకుండా.. డిమాండ్‌ను బట్టి ఇతర ఔషధాలను ఉత్పత్తి చేయడమూ నేరమేననీ, వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటించినా తప్పేనని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి ఇంకేమైనా జరుగుతున్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్ ప్రీతీ మీనా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మందుల్ని తయారుచేసే సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించకుండా ఇతర రాష్ట్రాలకే ఎక్కువగా సరఫరా చేస్తుంటాయని అధికారులు అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో ఉత్పత్తి సంస్థలు, వాటి గోదాములు, కేంద్ర కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కొన్నిరకాల మందులు మన రాష్ట్రానికి తరలివస్తుంటాయి. వాటిలో కూడా నకిలీలేమైనా ఉండి ఉంటాయా అనేదాని మీదా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.