అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలుగా మార్చిన కేసులో తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి నరేశ్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే...
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఖమ్మంపల్లి, జోగాపూర్, ఉప్పలవానిపేట, మన్నెగూడెం, గొల్లపల్లి, నెన్నెల, ఘన్పూర్, మైలారం గ్రామాల్లో 88 మంది రైతులకు 207 ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలు చేశారని సీపీ తెలిపారు. గతంలో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు కొంతమంది వీఆర్వోలతో కలిసి ఈ వ్యవహారం నడిపారని వెల్లడించారు. ఏఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు చేశారని చెప్పారు. అసైన్డ్ భూములను అమ్మడం, కొనడం నేరమని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు:
నెన్నెల మండలంలోని అసైన్డ్ భూములకు సంబంధించి వామన్‌రావు హత్య కేసుకు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని సీపీ సత్యనారాయణ తెలిపారు. అసైన్డ్ భూములకు, న్యాయవాదుల హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ రెహ్మాన్, రూరల్ సీఐ జగదీశ్ పాల్గొన్నారు.