Tailor attack on students: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం సౌత్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై దర్జీ దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. మూడు నెలల కిందట కళాశాలలో చేరిన విద్యార్థులు యూనిఫామ్ కుట్టాలని.. దర్జీకి దుస్తులు ఇచ్చారు. రెండు నెలలు కావస్తున్నా అతడు ఇవ్వకపోవడంతో ప్రశ్నించారు. దీంతో కోపగించుకున్న దర్జీ.. అతడి బంధువులు విద్యార్థులను నాలుగు గంటల పాటు నిర్బంధించడంతోపాటు దాడికి పాల్పడ్డారు.
విషయం తెలుసుకున్న కళాశాల కోశాధికారి కొండవీటి త్రినాథ్ మొగలూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. విద్యార్థులను గాయపర్చిన ఘటనపై పోలీసులు స్పందించి.. న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సహా విద్యార్థులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఇంతవరకూ ఎటువంటి కేసూ నమోదు చేయలేదని పేర్కొనడం గమనార్హం.
ఇదీ చదవండి: రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు.. లెక్కించలేక సిబ్బంది తంటాలు